Free Electricity : ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్.. ఇవీ మార్గదర్శకాలు
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలు, విద్యా సంస్థల నిర్వహణకు ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ అవి సరిపోకపోవడంతో విద్యుత్ బిల్లులు చెల్లించడం ప్రధానోపాధ్యాయులకు భారంగా మారింది. గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నట్లుగా విద్యా సంస్థలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని భావించింది. విద్యా సంస్థలకు యూనిట్ల పరిమితి లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి నెలలో విద్యుత్ వినియోగం, పాత బకాయిల వివరాలను సేకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో, విద్యాసంస్థలలో ఉచిత విద్యుత్ అమల్లోకి రావడంతో ఆయా విద్యా సంస్థలకు బిల్లుల భారం తప్పనుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
-ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరాకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)లు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ వివరాలు తీసుకోనున్నాయి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్వీడి)కి ఆ పోర్టలు లాగిన్ చేసేందుకు సదుపాయం ఇవ్వనున్నారు. తమ శాఖ పరిధిలోని విద్యా సంస్థల వివరాలను వెబ్ పోర్టల్లో చేర్చడం, తొలగించడం, సవరణలు చేయడం వటివాటికి అవకాశం ఇస్తారు.
- విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతీనెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇంచార్జ్ అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా ఈ చర్య ఉపకరించనుంది. అయితే ఈ బిల్లులను విద్యాసంస్థలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖల బడ్జెట్నుంచి ప్రతినెలా డిస్కమ్ లకు చెల్లిస్తారు.