TS: కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్ మామ
బీఆర్‌ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు.... ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు;
లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసికాంగ్రెస్ లో చేరుతున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ ZP ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ ఉదయం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె.... తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపారు. అనంతరం కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు.
మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ లో చేరారు. రంగారెడ్డి ZP ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ MLA తీగల కృష్ణారెడ్డి, GHMC డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత దంపతులు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఈ రెండు పార్టీలకు చెందిన దాదాపు 16 మంది ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో 20 మందికిపైగా కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ నుంచి నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు. తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ప్రకటించారు. కానీ, బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.
మరోవైపు ఈనెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ముగిసింది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఆ ఎన్నికకి శ్రమజీవి అభ్యర్థులు జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థి కిరణ్ రాథోడ్ వేసిన నామినేసన్లు.. తిరస్కరణకు గురయ్యాయి. ఈ మేరకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ వ వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక లాంఛనమే కానుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన వెంటనే ముగ్గురి ఏకగ్రీవ ఎన్నికను ఈసీ ప్రకటించనుంది.