GHMC: నకిలీ ధ్రువీకరణ పత్రాలకు చెక్
కొత్త విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్... జీహెచ్ఎంసీ సాఫ్ట్వేర్కి గుడ్‌బై;
నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీని అడ్డుకోవడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ను పక్కనబెట్టి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఓఆర్‌జీఐ) వెబ్ పోర్టల్‌ను వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త విధానం అమల్లోకి రాగానే జనన, మరణ ధ్రువీకరణలకు ఆధార్ తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం GHMCలో అందుతున్న "ఇన్స్టంట్" సేవలతో వేలాది నకిలీ ధ్రువీకరణ పత్రాలు చలామణిలోకి వచ్చాయి. పుట్టనివారికి జనన ధ్రువీకరణలు, బతికే వారికి మరణ ధ్రువీకరణలు సృష్టించి, వాటిని రోహింగ్యాలు లాంటి విదేశీ అక్రమ వలసదారుల పాస్‌పోర్టులకు కూడా వాడుతున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఓఆర్‌జీఐ వ్యవస్థలో, ఒకరికి ఒక్కసారి మాత్రమే ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు ఉండనున్నాయి. ఆసుపత్రులు, వైద్యులు ఇచ్చే సమాచారం ప్రకారం ఆన్లైన్లో నమోదు చేసిన వివరాల పరిశీలన తర్వాతే ధ్రువీకరణ పత్రాల మంజూరు జరుగుతుంది. దీనివల్ల నకిలీ ధ్రువీకరణలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అధికారులు నమ్ముతున్నారు. ఇకపై మీసేవా కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇక అధికారుల సమీక్ష అనంతరం మాత్రమే ధ్రువీకరణలు జారీ అవుతాయి. భవిష్యత్‌లో ఈ గణాంకాలు దేశ భద్రత, జన గణనకు ఉపయుక్తంగా మారనున్నాయి. GHMC కమిషనర్ కర్ణన్ ఈ వ్యవస్థ అమలులో చొరవ చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇది పూర్తిగా అమల్లోకి రానుంది.