రాష్ట్రంలో తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 24 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారం ఉదయానికి 31.5 అడుగులకు చేరింది. భద్రాచలం ఎగువ ప్రాంతాలైన తాలిపేరు, కాళేశ్వరం, సమ్మక్క సారక్క బ్యారేజీల నుంచి వరద నీరు వస్తున్నందున గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పెరిగిన వరద వల్ల గోదావరి నీటిమట్టం భద్రాచలం స్నాన ఘట్టాల మెట్ల వరకు చేరుకుంది.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుకుంటోంది. జూరాల ఇన్‌ఫ్లో 65,000 క్యూసెక్కులుగా రికార్డయింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టం 318.51 అడుగులు.. ప్రస్తుతం 317 అడుగుల నీటిమట్టం అందుకుంది. దీంతో అధికారులు శనివారం తెల్లవారు జామున జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. మొత్తం అయిదు గేట్లను ఎత్తివేసి 56,865 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 365 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టినట్లు తెలంగాణ జెన్‌కో తెలిపింది.