BRS Party Office : గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతకు రంగం సిద్ధం

Update: 2024-07-03 07:03 GMT

హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారంటూ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కరుకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేశారంటూ స్థలం కేటాయింపు ఒకచోట మరొక చోట నిర్మాణం చేశారని, నిర్మాణ సమయంలో కూడా సరైన అనుమతి తీసుకోకుండానే నిర్మాణం చేశారంటూ కాజీపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ నోటీసులు పంపించారు.

హనుమకొండ జిల్లా కార్యాలయానికి నోటీసులు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణలోని 33 జిల్లాల అధ్యక్షులను అప్రమత్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిజిల్లా కేంద్రంలో ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు పార్టీ కార్యాలయాల కోసం నామినల్ ధరలపై కొనుగోలు చేశారు. అలాగే అప్పటి ప్రభుత్వ అధికారులతో అనుమతులు తీసుకుని నిర్మాణం చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అన్ని రికార్డులను సంబంధిత జిల్లా కలెక్టర్ లకు ఒక ప్రతిని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఒక ప్రతిని పంపించాలంటూ కేటీఆర్ అన్ని జిల్లాల అధ్యక్షులకు సూచించారు.

హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే కుడా స్థలంలో నిర్మాణం చేశారు. అప్పటి ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం పక్కనే పార్టీ ఆఫీస్ ఉండేలా నిర్మాణం చేయించారు. అయితే 2023 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో కూడా వినయ్ భాస్కర్ ఓటమి చవిచూశారు.

Tags:    

Similar News