తెలంగాణలో గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్-2 తరహాలో.. గ్రూప్-3 రాతపరీక్షల్లోనూ పురుషులు టాప్‌లో నిలిచారు. టాప్-10 ర్యాంకుల్లో తొమ్మిది మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. టాపర్‌గా నిలిచిన అభ్యర్థికి మొత్తం 450 మార్కులకు 339.239 మార్కులు వచ్చాయి. టాప్-50ని పరిగణనలోకి తీసుకుంటే నలుగురు, టాప్-100లో 12 మంది మహిళలు ఉన్నారు. టీజీపీఎస్సీ సభ్యులు వై.రామమోహన్‌రావు, అమీరుల్లాఖాన్, పాల్వాయి రజినీకుమారి, కమిషన్ ఇన్‌ఛార్జి కార్యదర్శి సుమతితో కలిసి ఫలితాలను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు.
టాప్ స్కోరు ఎంతంటే...?
గ్రూప్-3 జనరల్ ర్యాంకింగ్స్‌ను టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. గ్రూప్-3లో పురుషుల్లో టాప్ ర్యాంకర్‌కు 339.24 మార్కులు వచ్చాయని టీజీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-3 మహిళా టాప్ ర్యాంకర్‌కు 325.15 మార్కులు వచ్చినట్లు తెలిపింది. మొదటి 36 ర్యాంకుల్లో ఒకే ఒక మహిళా అభ్యర్థి ఉన్నట్లు చెప్పింది.
1365 పోస్టులకు పరీక్ష
టీఎస్‌పీఎస్సీ 1,365 గ్రూప్-3 పోస్టులకు రాత పరీక్షలను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్ జారీ చేసింది. 5,36,400 మంది దరఖాస్తు చేశారు. 2024 నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించిన రాతపరీక్షల(మూడు పేపర్లు)కు 2,67,921 మంది హాజరయ్యారు.