రేవంత్‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ నిరసన గళాలు!

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ ఎక్కువ మంది రేవంత్‌ వైపే మొగ్గు చూపారు. ఇంకా తుది నిర్ణయం ఏదీ వెలువడకపోవడంతో..;

Update: 2020-12-26 09:36 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కాక రేపుతోంది. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరికి కట్టబెడతారనే అంశంపై 20 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి వంటి సీనియర్‌ నేతలు రేసులో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం కోమటిరెడ్డి, రేవంత్‌ మధ్యనే నెలకొంది. వీరిలోరేవంత్ రెడ్డికే పీసీసీ అధ్యక్షుడి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ ఎక్కువ మంది రేవంత్‌ వైపే మొగ్గు చూపారు. అయితే ఇంకా తుది నిర్ణయం ఏదీ వెలువడకపోవడంతో.. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ కొనసాగుతోంది. తమకే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలంటూ సీనియర్ నేతలు అధిష్టానానికి విన్నవించుకుంటున్నారు. ఐతే.. రెండు, మూడు రోజుల్లో పీసీసీ చీఫ్‌ ఎంపికపై అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

మరోవైపు రేవంత్‌ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వొద్దంటూ నిరసన గళాలు అంతకంతకూ ఊపందుకుంటున్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. రేవంత్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీలో ఉండనని వీహెచ్‌ స్పష్టంచేశారు. తనతోపాటు చాలామంది సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీని వీడతారని వీహెచ్ తెలిపారు.

టీపీసీసీ చీఫ్‌ను ప్రకటించక ముందే పార్టీలో కుమ్ములాటలు ఇలా ఉంటే.. అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంకెన్ని కుమ్ములాటలు జరుగుతాయో అని కాంగ్రెస్ అధిష్టానం తలపట్టుకుంటోంది.

Tags:    

Similar News