వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ అంగీకరించిందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలోనూ రేవంత్ అబద్ధాలు చెప్పారన్నారు. అంతటితో ఆగకుండా అమరవీరులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఏదో ఓ కాగితం తెచ్చి సభను తప్పుదోవపట్టిస్తున్నారని, సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయాలని భావిస్తున్నామన్నారు.
గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పుదోవ పట్టించారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారు. ఈ అంశంపై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాము.
సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తాం. నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారు అని హరీశ్‌రావు తెలిపారు.