తెలంగాణ రాష్ట్రంలో భారీ, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. అన్ని ప్రాంతాల్లో నీటి వనరులు కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా పడటంతో వ్యవసాయ పనులు కూడా లేటయ్యాయి. ప్రాజెక్టుల్లోకి నీరు చేరడం... మరోవైపు వర్షాలు తెరపివ్వడంతో వరి నాట్లు వేయడంలో రైతులు నిమగ్నమయ్యారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విడుదలైన నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా చేరుతోంది. దీంతో 24 గేట్లు ఎత్తి 2,70,920 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. 16 గేట్లను పది అడుగుల మేరకు, ఆరు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టులోకి 3,15,961 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా, మంగళవారం 585.40 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వలు 312 టీ ఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 298.5890 టీఎంసీలు ఉంది.
కుడికాలువ ద్వారా 8,023 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7,601 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తికి 28,217 క్యూసెక్కులు, ఏఎన్ఆర్పీకి 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నాలుగు రోజులుగా ఇన్లో తగ్గింది.