తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.