Heavy Rain Alert : తెలంగాణలో భారీ వర్షాలు

Update: 2025-09-26 05:34 GMT

తెలంగాణలో‍రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వర్షం పడింది. జిల్లా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో.. సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. సింగరేణి ఓపన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల పుష్కరఘాట్ వరకు గోదావరి వరద చేరింది. పలువురు రైతులకు సంబంధించిన సుమారు 100 ఎకరాల్లో మిర్చి, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లితో పాటు.. మల్లం పేట్ గ్రామంలో అధికారులు యూరియా పంపిణీ చేయగా.. రైతులు వర్షాన్ని లెక్కచేయకుండా తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2లక్షల 85వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 3లక్షల 56వేల866 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 40 గేట్లు తెరిచి 6 లక్షల 41 వేల 212 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. పార్వతి బ్యారేజ్ కు భారీగా వరద వస్తోంది. 74 గేట్లను ఎత్తి దిగువకు వరద విడుదల చేస్తున్నారు. అటు నేడు, రేపు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. హనుమకొండ, వరంగల్ , మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.

Tags:    

Similar News