బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం కురిసన వర్షంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు జిల్లాలలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇవాళ, రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, నాగర్ కర్నూల్, యాదాద్రి, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.