తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ రోజు (ఆగస్టు 11) భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు (ఆగస్టు 12)న వర్షాలు కొనసాగుతాయి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా వర్షాల సమయంలో బయటకు వెళ్లడం తగ్గించాలని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.