హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ఫ్యాక్స్ సాగర్ చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదకరంగా మారింది. చెరువు పూర్తి నీటిమట్టం 37 అడుగులైతే ప్రస్తుతం 34 అడుగుల వరకు నిండింది. చెరువు నిండుకుండలా మారడంతో ఎగువనున్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలమయమైంది. ఇక దిగువనున్న సుభాష్‌నగర్ కాలనీ అలుగు నీటితో జలదిగ్బంధంలో చిక్కుకుంది. చెరువులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు చెరువులోకి వరద పోటెత్తుతుండడంతో తూము ద్వారా నీటిని కిందకు వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తూము లీకవుతోందని గతంలో మూసివేయడంతో దాన్ని తెరవడం ప్రస్తుతం కష్టంగా మారింది. దీంతో తూమును తెరిచేందుకు నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్‌లకు చెందిన నిపుణులను ఇక్కడికి రప్పించారు. వారు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని నీటిలోపలికి వెళ్లి తూమును తెరిచేందుకు గంటల తరబడి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే తూము మొత్తం బట్టలు, చెత్తతో నిండిపోయిందని, దాన్ని తెరిచేందుకు మరికొన్ని గంటల సమయం పడుతుందని ఇరిగేషన్ ఏఈ రామారావు తెలిపారు.