HYD: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్గాహైదరాబాద్!
రెండేళ్లలో 10కిపైగా బడా కంపెనీలు.. టెక్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీలో జీసీసీల విస్తరణ;
హైదరాబాద్ అంతర్జాతీయ కార్పొరేట్ రంగంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఏర్పాటుకు కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌ను తమ GCCల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. గత రెండు నెలల్లోనే పదికి పైగా బడా కంపెనీలు ఇక్కడ తమ గ్లోబల్ సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈ విషయాన్ని చాటుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ ఆర్సెలార్ మిట్టర్ తాజాగా హైదరాబాద్‌లో జీసీసీ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ కేంద్రం ద్వారా HR, ఫైనాన్స్, ఐటీ వంటి కీలక బ్యాకెండ్ ఆపరేషన్లు నిర్వహించనుంది. అలాగే, అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ, హాస్పిటాలిటీ దిగ్గజం మారియట్ ఇంటర్నేషనల్, హెల్త్‌కేర్ సంస్థ ఎవర్ నార్త్, సైబర్ సెక్యూరిటీ బ్రాండ్ బ్లాక్ బెర్రీ, సైబర్ ఆర్క్ ఇప్పటికే జీసీసీలు ప్రారంభించాయి. ఇవి కాకుండా స్టోరబుల్, అలైన్ టెక్నాలజీ, మొండీ హోల్డింగ్స్, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, ఇన్స్పైర్ బ్రాండ్స్, ఓమ్నీ డిజైన్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ వంటి సంస్థలు హైదరాబాద్ ప్రయోజనాలను గుర్తించి తమ కార్యకలాపాలను విస్తరించాయి. దేశంలో కొత్తగా ప్రారంభించే ప్రతీ 100 జీసీసీల్లో 18 సెంటర్లు హైదరాబాద్‌లోనే కొలువుదీరుతున్నాయి. తద్వారా దేశంలో అత్యధికంగా జీసీసీ సెంటర్లు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. హైదరాబాద్‌లోని మొత్తం జీసీసీల్లో 3 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
హైదరాబాద్ ఎంపికకు ప్రధాన కారణాలు
టెక్నికల్ టాలెంట్ పూల్, మెరుగైన మౌలిక వసతులు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పరిశ్రమా అనుకూల విధానాలు. ప్రస్తుతం నగరంలో 355కి పైగా జీసీసీలు స్థాపితమై ఉన్నాయంటే, ఇది దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌గా మారిందని చెప్పొచ్చు. ఈ కేంద్రాల్లో ఇప్పటికీ 3 లక్షల మందికిపైగా నిపుణులు ఉద్యోగాలు పొందారు. టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, మానవ వనరుల శాఖల్లో హైఎండ్ ప్రాసెస్‌లకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. వచ్చే ఐదు నుంచి ఏడేండ్ల కాలంలో 35-40 శాతం కొత్త జీసీసీలు మన దేశంలో ప్రారంభం కానున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. వాటన్నింటికీ గమ్యస్థానం హైదరాబాద్ కాబోతున్నట్టు పారిశ్రామిక నిపుణులు అంచ నా వేస్తున్నారు. ఐటీ, రీసెర్చ్, ఫైనాన్స్, కస్టమర్ సేవల కోసం ఎంఎన్‌సీలు హైదరాబాద్‌లో ఇప్పటికే వందలాది జీసీసీలను ఏర్పాటు చేశాయి. ప్రతిష్టాత్మక ఎలీ లిల్లీ, మారియట్ ఇంటర్నేషనల్, ఎవర్‌నార్త్ వంటి సంస్థలు తమ గ్లోబల్ సెంటర్లను హైదరాబాద్‌లో ప్రారంభించాయి.