Telangana Election Polling: పల్లె ముందు వెలవెలబోయిన పట్నం ఓటర్లు

మళ్లీ పట్నం బద్ధకించింది;

Update: 2023-12-01 01:15 GMT

ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అవగాహన కల్పించినా గ్రేటర్‌ ఓటరు మారలేదు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల వారీగా మొత్తం ఓటింగ్‌ను పరిశీలిస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే గణనీయంగా తగ్గింది. బస్తీ ఓటర్లు మినహా నగరంలో యువకులు, విజ్ఞానవంతులు ఓటు హక్కును వినియోగించుకోలేదు. 

గ్రేటర్‌ వ్యాప్తంగా నమోదైతున్న ఓటింగ్‌ సరళిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఓటు హ క్కు ప్రాధాన్యతను వివరిస్తున్నా హైదరాబాద్‌లోనే ఓటు వేసేందుకు గడప దాటడం లేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, గతంలో అతి తక్కువ పోలింగ్‌ నమోదైన నియోజకవర్గాలపై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుందే.. కానీ, పోలింగ్‌ రోజున ఆ ఓటు వినియోగంలోకి రావడం లేదు. కోర్‌ సిటీతో పాటు, హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా ట్రెండ్‌ నడుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

2014 నుంచి ఇదీ మూడో ఎన్నిక. 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2019లో జీహెచ్‌ఎంసీ, 2019 లోక్‌ సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో ఓటింగ్‌ సరళిని గమనిస్తే… ప్రతి ఎన్నికల్లోనూ పెద్ద మార్పు ఉండటం లేదు. సగటున 55 శాతం లోపే ఓటింగ్‌ నమోదు కావడం పలు నియోజకవర్గాల్లో సర్వసాధారణంగా మారింది. హైదరాబాద్‌ జిల్లాల్లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉండగా, 2014లో సగటున 51.5 శాతం, 2018లో 50.3 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల వారీ ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తే… 2018 కంటే గణనీయంగా తగ్గింది. సాయంత్రం ఐదున్నర గంటల వరకు విడుదల చేసిన జాబితా ప్రకారం 23 నియోజకవర్గాల సగటు గతం కంటే 10-15 శాతం తక్కువగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఓటరు గడప దాటకపోవడంతో చివరి వరకు కూడా ఓటింగ్‌ శాతం ఏమాత్రం పెరగడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈసారి తక్కువ ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటం ఎన్నికల అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌రోడ్డుకు ఆవల ఉన్న దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. నగరాలు, పట్ణణ ప్రాంతాలైన హైదరాబాద్‌ సహా ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, కరీంనగర్‌లో మాత్రం పోలింగ్‌ తక్కువగా నమోదు అయింది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ఓట్లు గల్లంతయ్యాయన్న ఆందోళనలు, ఫిర్యాదులు పెద్దగా లేకపోవడం విశేషం. హైదరాబాద్‌ జిల్లాలో మరీ ముఖ్యంగా పాతబస్తీలో అతి తక్కువగా పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పోలైనట్టు తెలుస్తున్నది. తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గ్రామీణవాసులు బుధవారం నాడే హైదరాబాద్‌ నుంచి తమ గ్రామాలకు తరలి వెళ్లడం ప్రారంభించారు. జాతీయ రహదారులు కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. 

Tags:    

Similar News