AI Global Summit : ఏఐ విప్లవానికి హైదరాబాద్ ఆతిథ్యం.. దేశంలోనే మొదటిసారి
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరుగుతోంది. ఇలాంటి సదస్సు జరగడం ఇండియాలోనే ఇది మొదటిసారి. హైదరాబాద్ దానికి వేదిగకా నిలిచిందని ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య భద్రత, జీవశాస్త్రాలు, విద్య, వ్యవసాయం, న్యాయవ్యవస్థ తయారీ రంగం, పౌరసేవలు ఇత్యాది రంగాలలో ఎఐ ఆధారిత నవీకరణల ప్రగాఢ, విస్తార ప్రభావ ప్రాబల్యాలను అధ్య యనం చేసి, సంబంధిత మార్పులపై మన అవగాహనను మరింతగా మెరుగుపరచుకునేందుకు ఆ సమ్మిట్ దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది.
ట్రాఫిక్ జామ్ లను తగ్గించడం నుంచి అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు తోడ్పడడం వరకు ప్రభుత్వాలు తమ పౌరులకు అందిస్తున్న సేవల తీరుతెన్నులను ఏఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కిస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీ కేంద్రంగా వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఏఐ ఆధారిత భవిష్యత్తు కల్పించే అవకాశాలను సమగ్రంగా ఉపయో గించుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్ తదితర వ్యవస్థాపిత ఏఐ సాంకేతికతలు.. జెనరేటివ్ ఎఐతో కలిసి ఒక కొత్త పారిశ్రామిక విప్లవానికి దారితీస్తాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. తెలంగాణలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఏఐని మరింతగా ఉపయోగించాల్సి ఉందని.. ఈ సదస్సులో వాటిపై చర్చిస్తారని చెబుతున్నారు.