ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రివేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. విద్యార్థులు మెట్రో సేవలను మరింతగా వినియోగించుకునేలా 20 ట్రిప్పుల టికెట్ కొనుగోలు చేస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే ఆఫర్‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి,శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు.