TG: గంగమ్మ ఒడికి గణనాథులు

ఘనంగా ముగిసిన మహా నిమజ్జన ఘట్టం.. పక్కా ప్రణాళికతో ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం;

Update: 2024-09-18 03:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లో గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. పక్కా ప్రణాళికతో అధికారులు, పోలీసులు నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా చేశారు.

హైదరాబాద్‌లో ఘనంగా..

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దాదాపు లక్ష విగ్రహాలను నిమజ్జనం చేశారు. నాలుగు లక్షల మంది ప్రజలు దీనిని వీక్షించారు. ఆఫీసులకు, స్కూళ్లకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల పెద్దలు, పిల్లలు, ఇతర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలనే 2.5 లక్షల మంది సందర్శించారు. ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6.30 గంటలకే ప్రారంభం కాగా.. నిమజ్జన ఘట్టం మధ్యాహ్నానికే పూర్తయింది. భారీ క్రేన్‌ సాయంతో వినాయకుడిని దాదాపు మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో గంగమ్మ ఒడికి చేర్చారు. బాలాపూర్‌ వినాయకుడి శోభాయాత్ర ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4.30 గంటలకు ముగిసింది. వీటికి సమాంతరంగా అపార్టుమెంట్లు, కాలనీలు, బస్తీల్లో కొలువుదీరిన వేలకొద్దీ గణనాథుల విగ్రహాలు సాగర్‌ పరిసరాల చుట్టూ ఏర్పాటుచేసిన 38 క్రేన్ల వద్ద గంగమ్మ ఒడికి చేరాయి. రాత్రికి 50 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని పోలీసులు తెలిపారు. గణనాథుడి నిమజ్జనాల సందర్భంగా నెక్లెస్‌ రోడ్డు, సంజీవయ్య పార్కు రోడ్డు, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ రహదారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో దాదాపు 38 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

కామారెడ్డిలో ఉద్రిక్తత

కామారెడ్డిలో నిర్వహించిన శోభాయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఆలస్య నివారణకు పోలీసులు బ్యాండు మేళాలను పక్కకు తప్పిస్తూ వినాయక విగ్రహాలను ముందుకు పోనిచ్చారు. ఛత్రపతి సేన యూత్‌ గణేశ్‌ మండలి విగ్రహాన్ని ముందుకు పోనివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో పోలీసులు యువజన సంఘాల నాయకులను చెదరగొట్టగా.. తమకు లాఠీ దెబ్బలు తగిలాయంటూ పలువురు గాయాలు చూపుతూ ఆరోపించారు. నిరసనగా విశ్వహిందూపరిషత్, బజరంగ్‌దళ్‌ నాయకులు బైఠాయించారు. అర్ధరాత్రి దాటేవరకు కొనసాగిన ఆందోళన.. పోలీసులతో పలుమార్లు చర్చలు జరిపాక సద్దుమణిగింది.

Tags:    

Similar News