రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి, ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని ఇప్పటికే నిర్ణయించిన సీఎం.. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. ఈనెల 18న కేబినెట్ భేటీ నిర్వహించి, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని సీఎం నిర్ణయించారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.