నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం సిర్సవాడ గ్రామానికి చెందిన ఏదుల భీమమ్మ అనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారు చేపట్టిన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతూ, ఆమెను బెదిరించి డబ్బు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై స్థానిక పోలీసుల కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదులోని వివరాల ప్రకారం భీమమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె బావ ఏదుల నారాయణ తన భార్య పిల్లలతో కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుపడ్డారు. నారాయణకు అండగా నిలిచిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చిక్కోండ్ర మల్లేష్ జోక్యం చేసుకొని 25వేల రూపాయిలను డిమాండ్ చేశాడు. దీంతో భయపడిన భీమమ్మ 10 వేల రూపాయిలను మల్లేష్‌కు ఇచ్చారు. అయినప్పటికీ ఏదుల నారాయణకు మల్లేష్ మద్దతుగా నిలిచి తనను మోసం చేశారని , తన ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతున్నందున వీరందరిపై తగు చర్యలు తీసుకోవాలని భీమమ్మ తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు ఇందిరమ్మ కమిటీ సభ్యుడు మల్లేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం మాజిద్‌పూర్ కు చెందిన కల్లె సత్యాలు అనే ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తమ పంచాయితీ కార్యదర్శి రాఘవేంద్ర పలు రకాలుగా సమస్యలు సృష్టించి వేధిస్తున్నారని, 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఇల్లు బేస్‌మెంట్ వరకు పూర్తయిందని , ఇప్పుడు గ్రామ పైప్‌లైన్‌కు అడ్డంగా ఉందని చెప్పి ఇంటి ఫోటో కూడా తీయకుండా వేధిస్తున్నారని ఆమె కాల్‌సెంటర్‌కు తెలిపారు. 2నెలలుగా నరకం అనుభవిస్తున్నామని, తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని చెబితే అలాగే చేస్కోండి అంటూ సమాధానమిస్తున్నారని ఆమె తెలిపారు. దీనిపై అధికారులు లోతైన విచారణ జరుగుతున్నారు .