Godavari Floods: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Godavari Floods: ఎగువ నుంచి వస్తున్న వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద నీటిమట్టం 13.70 అడుగుల వద్ద కొనసాగుతోంది.

Update: 2022-09-14 07:00 GMT

Godavari Floods: ఎగువ నుంచి వస్తున్న వరదతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి వరద నీటిమట్టం 13.70 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఏ క్షణంలో అయినా సరే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కోనసీమ లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే, రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత.. క్రమంగా వరద తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి 12 లక్షల 80వేల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది.

అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. కూనవరం వద్ద ప్రస్తుతం గోదావరి నది 51.78 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. విలీన మండలం అయిన చింతూరు వద్ద శబరి నది 38 అడుగులు దాటి ప్రవహిస్తోంది. పలు చోట్ల రహదారులపై వరద నీరు పారుతోంది. దీంతో నాలుగు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఊళ్లను ముంచెత్తుతుండడంతో.. వరద బాధతులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఏడాదిలోనే వరుసగా నాలుగోసారి వరద రావడంతో విలీన మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే, ఉదయం నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 51.50 అడుగుల వద్ద ఉంది. భద్రాచలం వద్ద 13 లక్షల 43వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వరదలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి అధికారులు అలర్ట్‌గా ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.

Tags:    

Similar News