కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు అన్ని వివరాలు ఈ నెల 25లోగా ఇవ్వాలని ఇంజినీర్లను ఇరిగేషన్ శాఖ ఆదేశించింది. బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం, మూడింటికీ ఒకే డిజైన్లు అమలు చేశారా? పనులకు ముందు అధ్యయనం, పని కాకుండానే కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్ ఇవ్వడం, నిర్మాణం, నాణ్యత తనిఖీ సహా ఏ ఒక్క అంశాన్ని దాచొద్దని స్పష్టం చేసింది.
పుణె నుంచి వస్తున్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్(సీడబ్ల్యూపీఆర్ఎస్)కు చెందిన నిపుణులు కాళేశ్వరం బ్యారేజీలను బుధవారం పరిశీలించనున్నారు. సీడబ్ల్యూపీఆర్ఎస్కు చెందిన ముగ్గురు టెక్నికల్ నిపుణులు బ్యారేజీలను పరిశీలిస్తారని అధికారులు చెప్పారు. అక్కడ ఎన్డీటీ (నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్స్)తో పాటు జియోఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులు చేస్తారని వెల్లడించారు. ఫ్లడ్కు తగ్గట్టు ఇప్పుడున్న సిమెంట్ బ్లాకులు, బ్యారేజీలోని నిర్మాణాలు తట్టుకుంటాయా? లేదా? అని పరీక్షిస్తారని చెప్పారు.
తొలుత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి, ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద టెస్ట్లు చేస్తారని అధికారులు చెప్తున్నారు. మరోవైపు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ), ఢిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్)ల నిపుణులు రెండు రోజుల తర్వాత బ్యారేజీల వద్ద టెస్టులు చేస్తారని, దానికి సంబంధించిన ప్రజెంటేషన్ ఇస్తారని పేర్కొంటున్నారు. కాగా, మూడు బ్యారేజీల వద్ద రిపేర్ల పనులు, ఖర్చులను నిర్మాణ సంస్థలే భరించనున్నట్టు అధికారులు చెప్తున్నారు.