తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌కు ( Eatala Rajender ) బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధిష్ఠానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. రేపు ఆయన అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర బాధ్యతలు ఈటలకు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.
ఈటల రాజేందర్ తొలుత కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ పార్టీ అగ్ర నాయకత్వం ఒప్పించడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన సిద్ధమైనట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు.
దాదాపు ఇరవై ఏళ్లుగా టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కేబినెట్‌లో నంబర్ టూగా గుర్తింపు పొందిన సందర్భంలోనూ, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈటలకి ఉన్న విస్తృత పరిచయాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, సమర్ధవంతమైన నేతగా ఆయనకున్న ఇమేజ్ రాష్ట్ర ప్రగతికి దోహదపడతాయని అంటున్నారు. పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈటలకు గుర్తింపు రావడంతోపాటు వివిధ సామాజికవర్గాలతో ముఖ్యంగా బీసీ వర్గాలు, వర్గాలతో సత్సంబంధాలు ఉండడం కూడా బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.