జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు..
జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎలక్షన్లు ఈ నెల 21న జరగనున్నాయి. దీనికి సంబంధించిన నామినేషన్ల పక్రియ మార్చి 9 నుంచి 12 వరకు ఉంటుంది.;
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ (జెహెచ్‌సిహెచ్‌బిఎస్) ఎన్నికల తేదీ రానే వచ్చింది. ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఈ నెల 21న ఎలక్షన్ల ప్రక్రియ జరగనుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో సొసైటీలో సందడి వాతావరణం నెలకొంది.
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆసియాలో అతిపెద్దది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో 1,195 ఎకరాల్లో హౌసింగ్ సొసైటీ విస్తరించి ఉంది. 5 వేల మంది సభ్యులతో ఈ సొసైటీ తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఎలక్షన్లకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 3న జారీ చేశారు. పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్ ప్రక్రియ మార్చి 9 నుంచి 12 వరకు జరుగుతుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 71 లోని భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 21న పోలింగ్‌ను నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు ఉంటుంది. గెలిచిన వారు మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్స్‌ను ఎన్నుకుంటారు. ఈ సొసైటీలో ఓటింగ్‌కు అర్హులైన సభ్యులు 3181 మంది ఉన్నారు.