KAVITHA: కేసీఆర్ లేని జెండా.. కవిత సొంత ఎజెండా
తెలంగాణ వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత యాత్రలు.. జాగృతి జనం బాట పేరుతో రాష్ట్ర యాత్ర: కవిత.. కేసీఆర్ ఫొటో లేకుండానే పర్యటనలకు నిర్ణయం
తెలంగాణ జాగృతిని ముందుగా పల్లె పల్లెకు తీసుకుపోయి ఆ తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కేసీఆర్ ఫోటోను ఉపయోగించుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. జాగృతిని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత కేసీఆర్ ఫోటోను ఉపయోగించుకోవడం సముచితంగా ఉండదన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తమ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించారు. కవిత నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం ఉంది. స్థానిక ఎన్నికలపై స్పష్టత లేదు. అవి వచ్చినా స్థానిక నాయకత్వాన్ని ఇంకా సిద్ధం చేసుకోలేదు కాబట్టి పోటీ చేయకపోవచ్చు. ఆ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతాయి. అందుకే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ చేసి.. ముందుగా జాగృతిని బలోపేతం చేయాలనుకుంటున్నారు. పర్యటనలతో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చి క్యాడర్ ను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ రెండో దశ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరే ఆయినా.. కేసీఆర్ నడిచింది మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సహాలతోనేనని కవిత భావిస్తున్నారు. తెలంగాణ సమాజం అంతా జయశంకర్ సార్ అని పిలుచుకుంటుంది. జాగృతిని ప్రారంభించాలని చెప్పిందే ప్రొ.జయశంకర్ అని కవిత చాలా సార్లు చెప్పారు. అందుకే ఆయన ఫోటోతోనే తన రాజకీయాలను చేయాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ఫొటో లేకుండా కవిత ముందుకు వెళ్తుండడంతో త్వరలోనే పార్టీ ప్రకటిస్తారని తెలుస్తోంది.
అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించనున్న ఈ యాత్రలో భాగంగా తెలంగాణ మొత్తం 33 జిల్లాల మీదుగా కొనసాగేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫొటో లేకుండానే ఈ యాత్రను నిర్వహించాలని కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. ఇక ఈ యాత్రలో తన ఫోటోతోపాటు.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోను.. యాత్ర పోస్టర్లలో డిజైన్ చేయాలని తెలంగాణ జాగృతి శ్రేణులకు కల్వకుంట్ల కవిత ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి.. సొంతంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే కేసీఆర్ ఫోటో ఉంటే.. తమ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఫోటో లేకుండా ఈ యాత్రను నిర్వహించాలని భావిస్తున్నారు.