KAVITHA: తెలంగాణ రాజకీయ వేదికపై కొత్త పార్టీ
కొత్త పార్టీ దిశగా దేవనపల్లి కవిత అడుగులు... ప్రధాన అనుచరులతో రహస్య సమావేశం... కొత్తగా పార్టీ పెడితే ఎలా ఉంటుందన్న చర్చ
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న నెపంతో కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహరిష్కరించిన మరుసటి రోజే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. కవిత చేసిన ఈ కీలక ప్రకటనతో 20 ఏండ్లుగా ఆమెకు గులాబీ పార్టీతో ఉన్న అనుబంధం ముగిసింది. ఇక నుంచి ఆమె ఒంటరిగానే పోరాడబోతున్నారు. బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన కవిత కొత్త పార్టీ పెడతారా..? లేదా రాష్ట్రంలో ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలో జాయిన్ అవుతారా..? అన్న అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భవిష్యత్ కార్యాచరణపై కవిత కాస్త స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని.. తనకు ఏ పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. సన్నిహితులు, మేధావులు, జాగృతి కార్యకర్తలతో చర్చించాకే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కవిత కొత్త పార్టీ ఇదేనని.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
టీబీఆర్ఎస్ పేరుతోనేనా.. ?
తెలంగాణ నినాదంతో ఏర్పడిన టీఆర్ఎస్లోని ‘టీ’ అక్షరాన్ని తొలగించి బీఆర్ఎస్గా మార్చడాన్ని దృష్టిలో ఉంచుకొని.. తాను పెట్టబోయే పార్టీ తెలంగాణ (టీ)తో మొదలయ్యేలా.. పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జాగృతి శ్రేణులు చెబుతున్న ప్రకారం.. కవిత పెట్టనున్న పార్టీ పేరును ‘టీబీఆర్ఎస్"గా నిర్ణయిస్తారని, దానికి పూర్తిపేరు ‘తెలంగాణ భారత రాష్ట్ర సమితి’ అని ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే టీబీఆర్ఎస్ పేరుతోనే ‘తెలంగాణ బహుజన రాష్ట్రసమితి’ అని నిర్ణయించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అదీ కాకపోతే.. టీఆర్ఎస్ పేరు కలిసొచ్చేలా.. ఇప్పటికే గుర్తింపు పొందని పార్టీల విభాగంలో రిజిస్టర్ అయిన ‘తెలంగాణ రాజ్య సమితి’ పార్టీని ఆమె తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా తన ‘తెలంగాణ జాగృతి’ సంస్థనే రాజకీయ పార్టీగా కవిత మారుస్తారని అందరూ భావించారు. అయితే ఉద్యమ సమయంలో స్వచ్ఛంద సంస్థగా జాగృతిని ఏర్పాటు చేసినందున.. దానిని అలాగే కొనసాగిస్తూ కొత్తగా పార్టీ పెట్టాలని కవిత భావిస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ నడిపేంత సత్తా కవితకు ఉందా.. ?
అయితో కొత్త పార్టీని స్థాపించి నడిపేంత సత్తా కవితకు ఉందా.? వేరు కుంపటి పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతారు.? గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయంగా పార్టీని నడిపించగలరా..? ఇలా ఎన్నో సందేహాలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అయితే కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో తనపై జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆమె సొంత పార్టీ మీద గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ.. టీఆర్ఎస్ పేరుతో పుట్టుకొచ్చింది. ఉద్యమ నేపథ్యంలో ఏర్పాటై చివరకు భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. దాంతో అప్పటి నుంచి ఆ పార్టీ ప్రజలకు దూరం అయిందన్న ప్రచారం ఉంది. దాంతో మళ్లీ టీఆర్ఎస్ పేరిటనే పార్టీని స్థాపించి.. ప్రజల్లో నాటి సెంటిమెంట్‌ను తీసుకొచ్చేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. టీఆర్ఎస్ పేరును తెస్తేనే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్న ఆలోచనతో ఆమె ఉన్నారని సమాచారం. అందుకే.. టీఆర్ఎస్ అక్షరాలు కలిసేలా పార్టీ పేరు ఉండాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
జాగృతితోనే ప్రజల్లోకి..
కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయినప్పటి నుంచి ఆమె తెలంగాణ జాగృతి సంస్థతోనే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎక్కడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా జాగృతి కండువాలతోనే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే తన జాగృతి సంస్థను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగారు. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి పలు విభాగాలకు కమిటీలను ప్రకటించారు. ముందుగా సింగరేణిపై ప్రత్యేక ఫోకస్ చేసిన ఆమె సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్ని ఏరియాలకు ఇన్‌చార్జిలను ప్రకటించారు. అనంతరం హెచ్ఎంఎస్‌తో భాగస్వామ్యం అయ్యారు. ఇటీవల హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగానూ నియామకమయ్యారు. వీటి తర్వాత పలు దేశాలకు సంబంధించిన కన్వీనర్లనూ ప్రకటించారు. తాజాగా.. సస్పెన్షన్ నేపథ్యంలో ఇప్పటివరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలోనే నడుస్తారా? లేక బీఆర్ఎస్ వైపు వెళ్తారా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అంతా కవిత నామాస్మరణే మార్మోగుతోంది. కవిత భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరుగుతోంది.