KAVITHA: ఒంటరైన కల్వకుంట్ల కవిత.?
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు;
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడు పెంచింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేశానని... తన పోరాట ఫలితమే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత సంబరాలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను ఉద్ధేశించి తీన్మార్ మల్లన్న సంచలన వ్వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ‘బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా.. కంచం పొత్తు ఉందా.. మంచం పొత్తు ఉందా అంటూ ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ దళం మాత్రం స్పందించడం లేదు. అప్పట్లో లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కున్న కవితకు గులాబీ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ కవితకు బెయిల్ వచ్చే వరకూ ఆమెకు అండగా నిలిచారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ అంత రివర్స్ అయ్యింది. తీన్మార్ మల్లన్న సంచలన కామెంట్స్ చేసినా.. కవిత కుటుంబసభ్యుల నుంచి మాత్రం ఇంత వరకు ఎలాంటి స్పందన లభించకపోవడం వెనుక అంతర్యమేమిటో తెలియట్లేదు.
మాజీ సీఎం కేసీఆర్, ప్రతి విషయానికి టక్కున స్పందించే కేటీఆర్ కవిత విషయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారు..? కేటీఆర్ మాత్రమే కాదు.. బీఆర్ఎస్ కీలక నేతలు కూడా నోరు మెదపడం లేదు. కవిత వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఆమెకు మద్దతుగా ఉండాలి. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు ఇదే అంశం పార్టీ లీడర్లకు కూడా అంతు చిక్కడం లేదు. బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. పార్టీలో కేటీఆర్కు మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కవిత కేసీఆర్కు లేఖ రాశారు. శివుని ఆజ్ఞ లేనిదే.. చీమ అయిన కుట్టదు అన్నట్లుగా బీఆర్ఎస్లో కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించే కేసీఆరే ఈ విషయంపై ఎవరు మాట్లాడకూడదని ఏమైనా హుకూం జారీ చేశారా..? అందుకే అందరూ మౌనంగా ఉన్నారా..? అనేది రాజకీయ విశ్లేషకుల చర్చ. ఏదీ ఎమైనప్పటికి కవిత మాత్రం ఒంటరైనట్లే కనిపిస్తోంది.