తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈనెల 3న ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వెంటనే చైర్మన్ ఫార్మాట్లో తన రాజీనామా లేఖను కూడా ఆయన కార్యాలయానికి పంపారు. అనంతరం తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని స్వయంగా కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫోన్ కూడా చేశారు. దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. కవిత రాజీనామాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఇటీవల కవిత ఫోన్ కూడా చేశారని తెలిపారు. కానీ, మళ్లీ తన రాజీనామా అంశం తన దృష్టికి రాలేదన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఎమోషనల్‌గా రాజీనామా చేశారు కాబట్టి.. పునరాలోచన చేసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవితతో ముఖ్య నేతల భేటీలు హాట్ టాపిక్‌గా మారాయి.