KAVITHA: బీఆర్ఎస్లో కవిత కల్లోలం
శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యల దుమారం
కుటుంబాల చుట్టూ తిరిగే రాజకీయ పార్టీలకు అంతర్గత విభేదాలు ఎప్పుడూ ప్రమాదకరమే. ఏపీలో షర్మిల జగన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వైసీపీ పతనానికి పరోక్షంగా కారణమైంది. తాజాగా తెలంగాణలో కేసీఆర్‌కు భిన్నంగా కవిత స్పందించడం.. బీఆర్ఎస్ భవిష్యత్‌పై కొత్త చర్చకు దారి తీసింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ అంతర్గత అసంతృప్తులు వ్యక్తమవడం గమనార్హం. ఇది పతనమా లేక పునర్నిర్మాణమా అనేది వేచి చూడాలి మరి. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమె.. కేసీఆర్ దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని.. దేశ రాజకీయాలంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత సూటిగా ప్రశ్నలు సంధించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తాను ఒప్పుకోలేదన్నారు కవిత. తెలంగాణలో ఉన్న సమస్యలను .. పనులను పక్కన పెట్టి దేశ రాజకీయాలకు వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు.
శాసన మండలిలో మాట్లాడిన కవిత… కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టామని దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు?” అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి సూటిగా ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ఇంకా పరిష్కారం కాని అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం సరైంది కాదని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని తాను మొదటి నుంచే తీవ్రంగా వ్యతిరేకించానని వెల్లడించిన కవిత, ఆ సమయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఉద్యమ స్పూర్తిని వదిలేసిందని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా, ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ వర్గాల్లో చర్చ
కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడుతున్నాయా? లేక ఇది కొత్త రాజకీయ వ్యూహమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సమయంలో, కవిత రాష్ట్ర సమస్యలపై ఫోకస్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్కు రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి ఎంతవరకు ఆదరణ లభిస్తుందన్నది వేచి చూడాల్సిన అంశం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం. కవిత ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ నుంచి అధికారిక స్పందన ఎలా ఉండబోతుంది? జాగృతి పార్టీ రాజకీయంగా ఎంత బలంగా ఎదుగుతుంది? అన్నది రాష్ట్ర రాజకీయాలను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. బీఆర్ఎస్లో మహిళలకు సరైన ప్రాధాన్యం లేదని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాలాంటి ఒకరిద్దరిని మినహాయిస్తే, మిగతా మహిళలకు పార్టీలో చోటు లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు. మహిళల కోసం మాట్లాడే పార్టీగా చెప్పుకునే బీఆర్ఎస్, ఆచరణలో మాత్రం మహిళలను పక్కన పెట్టిందని విమర్శించారు.
శాసన మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శగా కాకుండా, తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. స్వంత పార్టీపైనే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, కేసీఆర్ దేశ రాజకీయాలపై తీసుకున్న నిర్ణయాలను సూటిగా ప్రశ్నించడం, అంతేకాదు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం ఇవన్నీ ఆమె రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా భావించబడుతున్నాయి.ఈ పరిణామాలతో బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు బహిరంగమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయానికి అవకాశం ఏర్పడుతోందన్న చర్చ కూడా మొదలైంది. కవిత ప్రస్తావించిన అవినీతి ఆరోపణలు, మహిళలు–ఉద్యమకారులకు పార్టీలో చోటు లేదన్న వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతాయన్నది రానున్న రోజుల్లో తేలనుంది.