తనపై అసభ్య పదజాలం వాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సభ్యత్వాన్ని రద్దు చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ లోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఫిర్యాదు లేఖ ఇచ్చారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై "కమిటీ ఆన్ ఎథిక్స్"కు రెఫర్ చేయాలని కోరారు. ‘శాసన మండలి సభ్యురాలినైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. గౌరవ చట్టసభలో సభ్యుడిగా ఉన్న మల్లన్న గారు ప్రజాప్రతినిధినైన నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రెండేళ్లుగా నేను ఉద్యమిస్తున్నాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బలంగా గొంతు వినిపిస్తున్నాను.” అని లేఖలో పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల ఉద్యమంపై దుష్ప్రచారం
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో నిర్వహించిన బీసీ విజయోత్సవ సభపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని కవిత పేర్కొన్నారు. చట్టసభ సభ్యురాలిపై ఇలాంటి మాటలు చెప్పిన తీన్మార్ గారి మనస్తత్వం ద్వారా, సామాన్య మహిళల పట్ల ఆయనకు గౌరవం లేదని నిర్ధారించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో మహిళల ప్రవేశాన్ని తగ్గించేలా ఉన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.