KAVITHA: కొత్త సంస్థగా తెలంగాణ జాగృతి
ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన.. ఆగస్టు 6న జాగృతి జంబో కమిటీలు.. ప్రతీ జిల్లాలో జాగృతి లీడర్ భేటీలు;
తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని వెల్లడించారు. జాగృతిని బలోపేతం చేసుకునేందుకు యువలీడర్లను ఆకట్టుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలతో పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుభవాలను ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో పంచుకోనున్నారని జాగృతి వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ జాగృతి వివిధ విభాగాల బాధ్యులలో ఎంపిక చేసిన ప్రతినిధులకు నాయకత్వ శిక్షణ ఇస్తున్నారు. మనం చేసేది అంతిమంగా కేవలం తెలంగాణ బాగుండటం కోసమేనని చెప్పారు.
రాజకీయమే మార్గం..
సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గం అని, పాలిటిక్స్‌లోకి రావాలనుకునే వారికి, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు అనుకునే వారికి మీ వెనక తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు. కంటెంట్, క్యాలిబర్, లాజిక్ లేనోడే తిట్లకు దిగజారుతాడని కవిత అన్నారు. ఎన్ని తిట్లు తిడితే అన్ని వ్యూస్ వస్తాయని యూట్యూబర్ల అండ కూడా వాళ్లకే ఉంటుందన్నారు. పక్కవాడిని కొట్టకుండానే వాడిలోని ఆలోచనను తుంచేసేంత పదునుగా తెలంగాణ జాగృతి పని చేయాలన్నారు. ఓ పక్క మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదర్ థెరిసా, చాకలి ఐలమ్మ, మార్టిన్ లూథర్ కింగ్, చేగువేరాల మంచితనం, పోరాటతత్వం, సమయస్ఫూర్తి అన్ని కలగలిసిన నాయకుడిగా తెలంగాణ జాగృతి నాయకులను సిద్ధం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన లీడర్ కాలేరని సమాజానికి తొలి లీడర్ ఇల్లాలే అని అన్నారు. రాజకీయంగా బయట చాలా కన్ఫ్యూజన్గా ఉందని తెల్లారితే ఎవరు పడితే వారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు.