తెలంగాణలో జాగృతి ఆధ్వర్యంలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి కాలానుగుణంగా తన పంథాను మార్చుకుందని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లీడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కవిత మన సంప్రదాయాలు, కట్టుబాట్లపై అవగాహన కల్పించుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. నిత్యం కొత్తగా ఉంటేనే సంస్థలు బతుకుతాయన్నారు. పుట్టుకతోనే ఎవ్వరూ నాయకత్వ లక్షణాలు అందుకోరని వాటిని పెంచుకుంటూ ముందుకెళ్తేనే నాయకుడవుతాడన్నారు. మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాలేడన్నారు.ఎదుటివారిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థమన్నారు. మహాత్మాగాంధీ ఎప్పుడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో లేరని... అయినప్పటికీ ఆయన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ జాగృతి నుంచి గాంధీగిరీకి కొత్త భాష్యం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతీ మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. సాంస్కృతిక నేపథ్యం లేని జాతి.. పునాది లేకుండా కట్టిన బిల్డింగ్ లాంటిదన్నారు. తెలంగాణ జాతికి అద్భుతమైన నేపథ్యం ఉందని... దానిని పరిరక్షించేందుకే జాగృతి పని చేస్తుందన్నారు.