Telangana: కొత్త పేరు, కొత్త అజెండాతో టీఆర్ఎస్..
Telangana: 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతుంటే వామపక్షాలు కూడా జాతీయపార్టీ హోదాలోనే ఉన్నాయి.;
Telangana: 2014లో ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలుగా కొనసాగుతుంటే వామపక్షాలు కూడా జాతీయపార్టీ హోదాలోనే ఉన్నాయి. మరికొన్ని పార్టీలు తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నాయి.. ఇప్పుడు మరో జాతీయ పార్టీ ఏర్పాటు కాబోతోంది.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమపార్టీగా పోరాటం చేసిన టీఆర్‌ఎస్ తరువాతి కాలంలో పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఇప్పుడు జాతీయ పార్టీగా రూపుదిద్దుకోబోతుంది.. కొత్త పేరు, కొత్త అజెండాతో ముందుకొస్తోంది. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారితే దాదాపుగా అన్ని పార్టీలూ జాతీయ పార్టీలే కానున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇప్పటికే జాతీయ
పార్టీలు కాగా, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం లాంటి పార్టీలు జాతీయ పార్టీలుగా మారాయి.ఒకటికి మించిన రాష్ట్రాల్లో పోటీ చేస్తూ జాతీయ పార్టీగా మారిపోయాయి. అంటే ఇక తెలంగాణలో దాదాపుగా అన్నీ జాతీయ పార్టీలే కానున్నాయి. అయితే ఇటీవలే పురుడుపోసుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రం ఇంకా స్థానిక పార్టీగానే ఉంది.
ఇక జాతీయ పార్టీ పేరుతో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టవచ్చు. నేషనల్ పార్టీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ కూడా చేయవచ్చు. అయితే ఆయా పార్టలను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా గుర్తించాలంటే మాత్రం కొన్ని అర్హతలు ఉండాలి.
ఒక రిజిస్టర్డ్ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లను సాధించాలి. ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ పోలై చెల్లిన ఓట్లలో ఈ ఓట్లు రావాలి. అంతేకాకుండా కనీసం నాలుగు ఎంపీ సీట్లను కూడా గెలవాలి.
మరోవైపు దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలవాలి. ఈ రెండుశాతం సీట్లు కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ఇక ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి అప్పుడే ఈసీ ఓ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది జాతీయ పార్టీ హోదాను సాధించుకుంది.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందితే దేశవ్యాప్తంగా ఒకే గుర్తు ఆ పార్టీకి లభిస్తుంది. ఇది ప్రధానమైన ప్రయోజనం. ఒకే గుర్తుపై దేశవ్యాప్తంగా పోటీ చేయవచ్చు. అంతేకాకుండా...గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు ప్రభుత్వ మీడియాల్లో ఫ్రీ టైం కేటాయిస్తారు.
ఓటర్ల జాబితాలను ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ రేటుకు భూమిని కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు 8 ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు జాతీయ హోదాను పొందాయి.