ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని సెప్టెంబర్ 6వ తేదీన చేయనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబర్ 7వ తేదీన నిమజ్జనం జరగాల్సి ఉండగా అదే రోజు చంద్రగ్రహణం ఉండటంతో ముందు రోజు నిమర్జనం చేస్తున్నట్టు తెలిపారు. శనివారమే మహాగణపతి శోభాయాత్రను నిర్వహించి నిమజ్జనం పూర్తి చేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. నేడు ఆదివారం కావటంతో విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం నాడు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తుల సౌకర్యార్థం మూడు క్యూలైన్లను ఏర్పాటు చేశారు
తాడిపత్రిలో గణేష్ శోభాయాత్రలో ఘర్షణ
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు, కాకర్ల రంగనాథ్ అనుచరులు పరస్పరం ఎదురెదురయ్యారు. మొదట నినాదాలతో ప్రారంభమైన వాగ్వాదం, తరువాత రాళ్ల దాడిగా మారి రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. అందిన సమాచారం ప్రకారం, ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గానికి చెందిన వినాయక విగ్రహం నిదానంగా వెళ్తుండటంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై ఆగ్రహించిన రంగనాథ్, ప్రభాకర్‌రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని రాళ్ల దాడులు జరిగాయి. ఈ దాడిలో రంగనాథ్ వర్గానికి చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు తిరిగి శోభాయాత్ర కొనసాగించారు. ఎన్నికల ముందుకు కాకర్ల రంగనాథ్ వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఎన్నికల అనంతరం ప్రభాకర్‌రెడ్డి, రంగనాథ్ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. అనంతరం శోభాయాత్ర కొనసాగింది.