KHARGE: తెలంగాణకు మోదీ చేసింది శూన్యం
11 ఏళ్లలో హైదరాబాద్‌కు ఇచ్చిందేమీ లేదు.. మేం మద్దతు ఇచ్చినా మోదీ యుద్ధం ఆపారు.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శలు;
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం కార్యకర్తలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఖర్గే... కాంగ్రెస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఇలా అందరూ ఐక్యంగా బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. హైదరాబాద్‌కు ప్రధాని మోదీ చేసింది శూన్యమన్న ఖర్గే... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని హామీ ఇచ్చారు. రేవంత్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తోందని... రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమే అని.. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారన్న ఖర్గే.. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని ‘ఆపరేషన్ సిందూర్’కు రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారుూ. మరి మోదీ ఎందుకు యుద్ధాన్ని మధ్యలోనే ఆపేశారని నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేయగానే యుద్ధం ఆపేశారన్న కాంగ్రెస్ చీఫ్.. కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పరని విమర్శించారు. గతంలో అమెరికా బెదిరించినా ఇందిరాగాంధీ భయపడలేదని గుర్తు చేశారు.
ప్రధాని మోదీకి ఖర్గే సవాల్
ప్రధాని మోదీకి ఈ సభా వేదికగా ఖర్గే సవాల్ విసిరారు. "రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం వంటి పదాలు తీసేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. నిజంగా రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు తీసే దమ్ము ప్రధాని మోడీకి ఉందా..?” అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని దుయ్యబట్టారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని.. దేశాన్ని కాపాడుతామని ధీమా వ్యక్తం చేశారు
మణిపుర్ ఈ దేశంలో భాగం కాదా?
" ఇప్పటి వరకు ప్రధాని 42 దేశాలు తిరిగారు.. కానీ మణిపుర్ వెళ్లడానికి మాత్రం ప్రధాని మోదీకి మనసు రాలేదు. ఆ రాష్ట్ర అంశంపై ఒక్కసారి కూడా ఆయన పెదవి విప్పలేదు. మణిపుర్ ఈ దేశంలో భాగం కాదా? మణిపుర్ వాసులు భారతీయులు కాదా?" అని ఖర్గే ప్రశ్నించారు. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన వాళ్లు ఉన్నారు.. మరీ బీజేపీ దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లో అలాంటి వాళ్లు ఉన్నారా..? పాక్, భారత్ యుద్ధం ఆపానని ట్రంప్ పదే పదే అంటుంటే మీరు ఎందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు.