Kaleshwaram : కాళేశ్వరంపై మూడు లిఫ్టులు అనవసరం.. కోమటిరెడ్డి హాట్ కామెంట్
కాళేశ్వరం ప్రాజెక్టుపై అవసరం లేకుండా మూడు లిఫ్ట్ లను ఏర్పాటు చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని దొనకల్ గ్రామంలో 3 కోట్లతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్లగొండ పట్టణంలో ప్రజాదర్బార్ నిర్వహించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.
నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం కోసం త్వరలో అమెరికా నుంచి యంత్రాలను తెప్పించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తాను 30 సంవత్సరాలు చట్టసభల్లో ఉన్నానని, ఎప్పుడూ ఇంత మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చూడలేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వాలు మునుపెన్నడూ వ్యవసాయ రంగానికి కేటాయించని విధంగా బడ్జెట్ లో 72,659 కోట్లను కేటాయించామన్నారు. 31 వేల కోట్ల రూపాయలతో రుణమాఫీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో 20 ఎకరాలలో సమీక ఎత వసతి గృహ నిర్మాణాలను చేపడతామని చెప్పారు. రెండు నెలల్లో ఈ వసతి గృహాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ వెల్లంల, శివన్న గూడెం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు.