పూటకో మాట, నిమిషానికో నాటకం వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన మానసిక వ్యాధితో తల్లడిల్లుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిలకడలేని విధానాలు, అబద్దాలు, అసమర్థత, స్వార్థ ప్రయోజ నాలకోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షేమం, అభివృద్ధి రంగాలను రేవంత్ రెడ్డి పాతాళంలోకి నెట్టి వేశారని గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భయంకరమైన మానసిక వ్యాధితో తల్లడిల్లుతున్న రేవంత్ రెడ్డిలో ఓ అపరిచితుడు దాగి ఉన్నాడని నిందించారు. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించిన వైద్యులు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో రేవంత్ రెడ్డి తల్లడిల్లు తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన మేడిగడ్డను కుటిల కాంగ్రెస్ రహస్యంగా బాంబులతో పేల్చి రాజకీయం చేస్తున్నారనే సందేహం తనకు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూ కమిషన్లు, విచారణ పేరుతో ప్రజల్లో అబద్దం ప్రచారం చేసేందుకు రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నించినా నిజం నిలకడగా తేలుతోందని కేటీఆర్ అన్నారు. నీచ, వక్రబుద్ధి గల కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం నేర్పే సమయం సమీపంలోనే ఉందని హెచ్చరించారు.