KTR : తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేస్తాం : కేటీఆర్
KTR : 2024 పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు;
KTR : 2024 పార్లమెంట్ ఎన్నికలే బీఆర్ఎస్ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్.. బీఆర్ఎస్ జెండా, ఎజెండా.. మిషన్‌ను వివరించారు. తెలంగాణ మోడల్‌ను దేశవ్యాప్తం చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రిజిస్ట్రేషన్‌పై ఈసీ పాజిటీవ్ నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్.. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర బీజేపీ పాలనలో ప్రతిపక్షాలనే ఈడీ, సీబీఐ టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటివరకు ఒక్క బీజేపీ నాయకుడిపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. వ్యవస్థలను ఎలా ఉపయోగించుకోవాలో తమకు తెలుసన్న కేటీఆర్.. మోదీ అండ్ కో వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు.
ఇక బీఆర్ఎస్ ఎజెండా, పొత్తులపైనా మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దాదాపు ఏడాదికాలంగా సీఎం కేసీఆర్ దేశంలోని వివిధ రాజకీయ నేతలు, రైతు, ప్రజా సంఘాలు, ఆర్థికవేత్తలతో చర్చలు జరిపారని గుర్తుచేశారు.
అందరితో చర్చించాకే జాతీయ స్థాయిలోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు మంచి స్పందన ఉందన్నారు. కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌ను ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే రైతుబంధు, దళితబంధు సహా తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను దేశ ప్రజల ముందుంచుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రధాని మోదీపైనా మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దివాళాకోరు, పనికిరాని ప్రధానిగా మోదీ మిగిలిపోయారని ఫైర్ అయ్యారు. మోదీ జన్ కీ బాత్ వినడు.. మన్ కీ బాత్ మాత్రమే చెప్తాడన్న కేటీఆర్.. బిల్డప్ తప్ప పనేం లేదని ఎద్దేవా చేశారు. 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉందని తెలిపారు. దేశంలో వికాస్ తప్పిపోయిందని, అచ్చే దిన్ ఎప్పుడొచ్చేది తెలియదని చురకలంటించారు.
మోదీకి మాత్రమే అచ్చే దిన్ ఉందని, ఆయన మాత్రమే ధనవంతుడు అయ్యారని విమర్శించారు. 2022 వరకు అందరికి ఇళ్లు ఇస్తా అని ప్రజలకు మోసం చేసిన ప్రధాని.. తాను మాత్రం 435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దండయాత్ర చేసినట్టు ఏక్‌నాథ్ షిండే, బొమ్మై లు వచ్చారన్నారు. రాజకీయ భావ దారిద్రం కోసం బీజేపీ చిల్లర నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు.
ఇక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపైనా మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ భారత్ జోడో కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర అనే పేరుతో పాదయాత్ర చేస్తే బాగుంటుందని చురకలంటించారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణలో ఎన్ని రోజులైనా రాహుల్ పాదయాత్ర చేసుకోచ్చన్న కేటీఆర్.. కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చేస్తుందన్నారు.
8 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర పథకాలు, తెలంగాణ అభివృద్ధిని పొగుడుతూ కేంద్రం స్వయంగా పార్లమెంట్‌లో చెప్పిన విషయాలను గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలు, రైతులు తెలంగాణ పథకాలను అనుసరిస్తున్నాయన్నారు.
ఇక మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ వందశాతం గెలిచి తీరుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తన స్వలాభం కోసం బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. మునుగోడు ఆత్మగౌరవానికి, కాంట్రాక్టర్ బలుపునకు జరుగుతున్న యుద్ధంలో టీఆర్ఎస్‌దే విజయమని, బీజేపీ, కాంగ్రెస్‌లు 2, 3 స్థానాలకు పరిమితమవుతాయని కేటీఆర్ జోష్యం చెప్పారు.