మేడిగడ్డ కొట్టుకు పోయిందని.. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో జరిగింది చిన్న విషయమే.. పెద్దది కాదని ఆయన స్పష్టం చేశారు. వరదను తట్టుకొని మేడిగడ్డ నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్ట్ గొప్పతనమని చెప్పారు. త్వరలో మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వివరంగా చెప్తామన్నారు. ఈ మేరకు శనివారం కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు, కేసులు పెడుతున్నారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. లైబ్రరీల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అక్రమంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఫిర్యాంపులపై న్యాయ ప్రక్రియ నడుస్తుందని గవర్నర్‌కు తెలిపామన్నారు. తాము చెప్పిన సమస్యలపై ఆయన స్పందించారని కేటీఆర్ చెప్పారు.