KTR : అందుకు మోడీ సర్కార్ చరిత్రలో నిలుస్తుంది : కేటీఆర్

KTR : కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌.

Update: 2022-08-05 02:15 GMT

KTR : కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థ పైన చేసిన డొంక తిరుగుడు ప్రసంగం...కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను దాచలేదన్నారు. పార్లమెంట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థపైన నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.

ద్రవ్యోల్బణం కారణంగా సాధారణ ప్రజలు పడుతున్న బాధలపైనా సీతారామన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తన వ్యాఖ్యలతో కొట్లాది భారతీయుల కష్టాలను నిర్మలా అవహేళన చేశారన్నారు. దేశ చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న దరిద్రపు ప్రభుత్వంగా మోడీ సర్కార్ చరిత్రలో నిలుస్తుందన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి బలహీనపడడం, గడిచిన 30 సంవత్సరాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం...45 సంవత్సరాల్లో అత్యధిక నిరుద్యోగం, పేదరికంలో నైజిరియాను వెనక్కి నెట్టడం వంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పాలనకు నిదర్శనమన్నారు. నల్లధనం వెనక్కి తెస్తామన్న మోదీ హామీ అసత్యమని తేలిపోయిందన్నారు. డీమానిటైజేషన్‌ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

GST పేరుతో కేంద్రం సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు కేటీఆర్. అర్థం లేని పన్ను స్లాబ్‌లతో నిత్యావసర వస్తువులపై భారీగా పన్నులు విధించిందన్నారు. పరిశ్రమలను, పారిశ్రామిక వర్గాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు జీఎస్టీ పేరుతో భయపెడుతున్నాయన్నారు. పాలు, పెరుగు, బియ్యం వంటి అత్యవసర వస్తువుల పైన సైతం భారీగా పన్ను మోపిన ప్రభుత్వం నరేంద్ర మోడీది మాత్రమే అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చేనేత వస్త్రాలపైనా జీఎస్టీ వేసిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కుతుందన్నారు. పసిపిల్లలు వాడే పెన్సిల్‌ మొదలు హాస్పిటల్‌ బెడ్స్‌..చివరికి అంత్యక్రియల వరకు అన్నింటిపై పన్నులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్ ధరలు పెంచి దోపిడీకి పాల్పడుతుందన్నారు. 2014 వరకు పెట్రోల్‌,డీజిల్‌పై ఉన్న టాక్స్‌లను భారీగా పెంచిందన్నారు. పెట్రోల్‌పై టాక్స్ రెట్టింపు చేయగా..డీజిల్‌పైన సుమారు నాలుగున్నర రెట్లు పెంచిందని గుర్తు చేశారు కేటీఆర్. మోదీ ప్రధాని కాకముందు పెట్రో పన్నుల ద్వారా కేంద్ర..రాష్ట్రాలకు సమానపు ఆదాయం వచ్చేదన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండున్నర రెట్లు ఆదాయం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు భరించలేక పేరొందిన ఆర్థికవేత్తలు...ప్రభుత్వ, ఆర్బీఐ పదవుల నుంచి వెళ్లిపోతున్నారని గుర్తు చేశారు కేటీఆర్. తమ అసమర్థ విధానాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కోవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి అంశాలపై తమ తప్పులు రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఆర్థిక వ్యవస్థ విషయంలో ముందు చూపు లేకపోవడం, సవాళ్లు అంచనా వేయడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. భారీ కార్పొరేట్‌ కంపెనీలకు మేలు జరిగేలా క్రోని క్యాపిటలిజంను మోదీ సర్కార్ ప్రోత్సహిస్తుందన్నారు. కేంద్రం విధానాలపై ప్రశ్నిస్తే...దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి..విభజించు పాలించు అనే దుర్మార్గపు విధానాలతో కేంద్రం ముందుకు వెళ్తోందన్నారు. ఇప్పటికైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేలా నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.


Tags:    

Similar News