TS NDRF : ఫెడరలిజం అంటే ఇదేనా : కేటీఆర్
TS NDRF : NDRF నిధులు విషయంలో కేంద్రప్రభుత్వం తెలంగాణకు మళ్లి మొండిచేయి చూపించింది.;
TS NDRF : NDRF నిధులు విషయంలో కేంద్రప్రభుత్వం తెలంగాణకు మళ్లి మొండిచేయి చూపించింది. గత నాలుగు ఏళ్లుగా NDRF నిధులు విడుదలను విడుదల చేయకపోవడంపై టీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తుందని మంత్రికేటీఆర్ దుయ్యబట్టారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు.
ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఇప్పుడు.. NDRF నిధులు విడుదల అంశం మరింత వివాదాస్పదంగా మారింది. కేంద్రప్రభుత్వం ఇచ్చే NDRF నిధులను తెలంగాణకు గత నాలుగు ఏళ్లుగా ఇవ్వడంలేదు. ఏపీ, గుజరాత్,బిహార్, కర్నాటక రాష్ట్రాలకు ఇచ్చి.. తెలంగాణకు ఇవ్వకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు గులాబీనేతలు.
NDRF నిధులపై లోక్‌సభ సభ్యుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ అడిగిన ప్రశ్నకు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్.. లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అందులో పేర్కొన్నారు. 2018 నుంచి 2022 వరకు ఏపీకి 2వేల 584 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినట్లు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్రం తెలంగాణకు ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కేంద్రం రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని దుయ్యబట్టారు.
వరదల సమయంలో కేంద్రం ఇచ్చే NDRF నిధులు విడుదల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ట్వీట్ చేశారు మంత్రికేటీఆర్. భారీ వర్షాలు.. వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా.. కేంద్రప్రభుత్వం 2018నుంచి ఒక్కరూపాయి కూడా NDRF నిధులు విడుదల చేయలేదన్నారు. ఇదేనా సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ కో ఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
2020లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు.. 2022లో గోదావరి వరదల్లోగానీ సహాయం అందించలేదు ఎందుకని మంత్రికేటీఆర్ ప్రశ్నించారు.