తన కాన్వాయ్‌పై కాంగ్రెస్ శ్రేణులు చేసిన దాడిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాడిని కాదని.. మీ తాట తియ్యడానికే వచ్చానంటూ సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను తప్పదోవపట్టిస్తూ, వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు.అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.