తెలుగుదేశం పార్టీకి ఎల్.రమణ రాజీనామా.!
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా చేశారు. తన రిజైన్ లేఖను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు.;
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా చేశారు. తన రిజైన్ లేఖను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే తాను పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నిన్న భేటీ తర్వాత టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్న రమణ.. ఇవాళే తన అభిప్రాయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామి కావాలనుకుంటున్నానని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు పూర్తి తోడ్పాటు అందించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఎల్లుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారు.
నిన్న మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్‌లో KCRతో సమావేశమయ్యారు రమణ. ఈ సందర్బంగా పార్టీలో తనకుండే ప్రాధాన్యం ఇతర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే టికెట్‌పైనా మాటలు జరిగాయి. BC సామాజికవర్గంలో బలమైన నేతగా, సౌమ్యుడిగా పేరున్న రమణను పార్టీలోకి తీసుకొచ్చేందుకు నెల రోజులుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా చివరికి ఆయన ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నికల వేళ ఎల్.రమణ చేరికతో పార్టీ బలోపేతం అవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.