LASTRIGHTS: నేడు ప్రజా కవి అందెశ్రీ అంత్యక్రియలు
అందని లోకాలకు అందెశ్రీ.. ప్రముఖుల సంతాపం
రచయిత అందెశ్రీ పార్థివదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఆయన నివాసానికి తరలించి కాసేపు ఉంచారు. తరువాత ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియానికి తరలించారు. నేడు ఘట్కేసర్లో అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రజా కవి అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి... రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందెశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరనిలోటని రేవంత్ పేర్కొన్నారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. " తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతి కలిగించింది. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు. కవి అందెశ్రీ మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'అందెశ్రీ హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. గొర్రెల కాపరిగా, కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు... ’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుంది. అందెశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' ట్వీట్ చేశారు.