గండిపేట మండలం, మంచిరేవులలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్ లోని కానిస్టేబుల్స్ కు తెల్లవారుజామున చిరుతపులి కనిపించింది. వెంటనే వారు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నత అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి గ్రేహౌండ్స్ క్యాంపస్ లో చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత ఆచూకీ కోసం రెండు వేర్వేరు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా చిరుతపులుల సంచారం వెలుగులోకి వచ్చింది. పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతం నుంచి ఇవి అప్పుడప్పుడు జనవాసాల్లోకి వస్తున్నాయని తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.