LOCAL BODY: స్థానిక రిజర్వేషన్లు ఖరారు.. గ్రామాల్లో జోష్
ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీ రిజర్వేషన్లు ఖరారవ్వడంతో గ్రామాల్లో జోష్ పెరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పోస్టులకు సంబంధించి మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీడ్రా తీశారు. జడ్పీ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో 15 జడ్పీలను మహిళలకు కేటాయించారు. అలాగే ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు కూడా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టరేట్లలో లక్కీ డ్రా తీశారు. కాగా, రాష్ట్రంలోని 31 జడ్పీల చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్సృజన శనివారం గెజిట్ జారీ చేశారు. 31 జడ్పీల్లో ఎస్టీలకు 4 , ఎస్సీలకు 6, బీసీలకు 13 జిల్లాలు రిజర్వ్ అయ్యాయి. అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 8 జిల్లాలు ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం పదవులు రిజర్వ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలకు ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు ఆ మొత్తంలోనే స్థానాలను కేటాయించింది. జెడ్పీ చైర్పర్సన్ల రిజర్వేషన్లను పరిశీలిస్తే బీసీలకు 41.93 శాతం, ఎస్సీలకు 19.35 శాతం, ఎస్టీలకు 12.90 శాతం, అన్‌రిజర్వుడ్‌కు 25.80 శాతం దక్కినట్టుగా తెలుస్తోంది.
బీసీ కులగణన ప్రకారమే...
రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే పూర్తయినందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేశారు. దీంతో ఇంతకాలం రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరంగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకు ఆ అవకాశం లభించనుంది. రిజర్వేషన్లు మారడంతో సర్పంచ్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావహులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే కుతూహలంతో ఉన్నారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్లు పదేళ్ల వరకు ఉండేలా మార్పులు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లకోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసేలా చట్ట సవరణ చేయడంతో ఆశావహులు పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వివిధ కేటగరీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించగా, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు.
జిల్లా పరిషత్ రిజర్వేషన్ల కేటాయింపు..
రాష్ట్రంలో వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన జిల్లా పరిషత్ (జడ్పీ) అధ్యక్ష స్థానాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన జిల్లాలు ములుగు, ఖమ్మం, వరంగల్, నల్గొండ. ఎస్సీ సామాజిక వర్గానికి.. హన్మకొండ, జనగామ, జోగులాంబ గద్వాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి.
* బీసీ సామాజిక వర్గానికి.. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మంచిర్యాల, వికారాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి.
* ఇక జనరల్ కేటగిరీ కింద.. పెద్దపల్లి, జగిత్యాల, నారాయణ పేట, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం.
త్వరలోనే ఎన్నికలు
ప్రభుత్వం తాజాగా జీవో విడుదల చేయడంతో.. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయనే సంకేతం రాజకీయ పార్టీల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రక్రియ పూర్తయితేనే.. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ZPTC) మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (MPTC) ఎన్నికల ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకం, పోలింగ్ కేంద్రాల ఖరారు వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ రిజర్వేషన్ల ప్రకటనతో ఆయా జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. . రిజర్వేషన్లను బహిర్గత చేయగానే గ్రామాల్లో ఎన్నికల ఆశావహులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కోరుకున్నచోట కోరుకున్న విధంగా రిజర్వేషన్లు వచ్చినవారు సంబరపడుతుండగా తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రాని చోట కొంతమంది నాయకులు నిరాశ చెందడం జరుగుతుంది. పోటీలో ఉండే అభ్యర్థులంతా ఒక్కసారిగా తెరపైకి వచ్చేశారు. గ్రామాలలో తిరుగుతూ పోటీలో ఉంటామని సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారు.