LOCAL WAR: నేటి నుంచి సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు
తొలి విడత స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ... మొదటి దశలో 4,200 సర్పంచ్ స్థానాలకు పోలింగ్... 37,440 వార్డులకు నామినేషన్ల స్వీకరణ
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో అభ్యర్థుల హడావుడి ఎక్కువైంది. సర్పంచ్ కావాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఆశావహులు తాజా నోటిఫికేషన్లో రంగంలోకి దిగారు. కులసంఘాలు, యువజన సంఘాలు, మండలంలో ఉన్న ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకుతాయిలాలు అందిస్తున్నారు. ఇక ఊర్లలో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ అభ్యర్థి వరకు ఇప్పటి నుంచే ఇళ్లకు వెళ్లి ఓటర్లతో మాట ముచ్చట కలుపుతున్నారు. పింఛన్లు వస్తున్నాయా..? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా..? తాగునీరు వస్తుందా..? ఇంకా ఏఏ సమస్యలు ఉన్నాయి..? అంటూ వాకాబు చేస్తున్నారు.
మొదటి విడత నేటి నుంచే..
మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. సర్పంచ్, వార్డు సభ్యులు వారి నామినేషన్లను సమర్పించవచ్చు. నవంబర్ 29వ తేదీ వరకు వీటిని స్వీకరిస్తారు. నవంబర్ 30వ తేదీ నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. వీటిపై డిసెంబరు 1న వినతులను స్వీకరిస్తారు. డిసెంబర్ 2వ తేదీన ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ ఉంటుంది.
తక్కువ డిపాజిట్తోనే...
అతి తక్కువ ఫీజుతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. జడ్పీటీసీ జనరల్ అభ్యర్థి రూ.5 వేలు, రిజర్వుడ్ అభ్యర్థి రూ.2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీకి జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వుడ్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి. సర్పంచ్ జనరల్ అభ్యర్థి రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఇక వార్డు మెంబర్గా పోటీ చేసే జనరల్ కేటగిరి అభ్యర్థి కేవలం రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థి రూ.250 చెల్లిస్తే పోటీకి అర్హులు అవుతారు. నామినేషన్లు వేశాక అసంతృప్తులను బుజ్జగించి, పోటీ నుంచి తప్పించడమూ జరుగుతున్నది. 2019 ఎన్నికల్లో 16 శాతం గ్రామాల్లో సర్పంచ్స్థానాలు యునానిమస్అయ్యాయని అప్పట్లో ఈసీ ప్రకటించిందంటే ఏకగ్రీవాలకు ఇక్కడ ఎంత క్రేజ్ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఈ ఏకగ్రీవాలు అనుమానమే అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేస్తున్న ప్రతిపాదనలే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈ సారి ఏకగ్రీవాలకు తావులేకుండా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు స్టేట్ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రతిపాదనలను రెడీ చేస్తున్నది. ‘రైట్ నాట్ టు ఓట్’ ప్రకారం అభ్యర్థి నచ్చకుంటే నోటాను ఎంచుకునే హక్కు ఉంది.