LOCAL WAR: రెండు సర్పంచ్ పదవులు.. రూ.2 కోట్లు!
తెలంగాణలో భారీ ధర పలుకుతున్న సర్పంచ్ పదవి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాగా.. గ్రామాల్లో ఏకగ్రీవానికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ పదవులపై కన్నేసిన ఆశావాహులు ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు. మహబూబ్‌నగర్ టంకర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఓ వ్యాపారి రూ. కోటికి దక్కించుకున్నాడు. అలాగే ఖమ్మం జిల్లాలోని ముఠాపురం సర్పంచ్ పదవిని ఆశించిన ఓ వ్యక్తి.. కోటి రూపాయలతో గ్రామాభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చాడు.
సర్పంచ్ పదవి కోసం అమెరికా నుంచి వచ్చేశాడు
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ కంజర్ల చంద్రశేఖర్. చిన్నశంకరంపేటసర్పంచ్‌గా తన తాత శంకరప్ప 40 ఏళ్ల పాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారు.అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రూ.లక్షల వేతనం అందించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలాడు. ఆరునెలల క్రితం పంచాయతీ నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రభుత్వ ప్రకటనతో.. చంద్రశేఖర్ అమెరికా నుంచి గ్రామానికి చేరుకున్నాడు. మూడు నెలలుగా ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు.
మరోవైవు.... తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. తొలిరోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో సర్పంచి పదవులకు 3,242, వార్డు పదవులకు 1,821 ఉన్నాయి. నిబంధనల ప్రకారం... ఎన్నికల వ్యయ పరిశీలన కోసం అభ్యర్థులకు కొత్త బ్యాంకు ఎకౌంట్ ఉండాలి. దీంతో అభ్యర్థులంతా బ్యాంకులను ఆశ్రయించారు. ఖాతా తెరవడానికి బ్యాంకు అధికారులు పాన్ కార్డును అడుగుతున్నారు. చాలామందికి పాన్ లేకపోవడంతో ఖాతాలు తెరవలేకపోయారు. పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరిచేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించినా... చాలా గ్రామాల్లో అవి లేవు. మరోవైపు నామినేషన్లకు ఈ నెల 29 వరకే గడువుంది.