Madhavilatha Complaint Files : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి, బీజేపీ నేత మాధవీలత సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జేసీ వ్యవహారంపై తన కుటుంబసభ్యులు సైతం భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జేసీపై ఆమె ‘మా’, ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలకు యువతులు వెళ్లొద్దంటూ మాధవి ఓ వీడియో విడుదల చేయగా, ఆమెపై జేసీ ఫైరయ్యారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు.
లేఖలో మాధవీలత ఏమన్నారంటే?
'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.